ఆసుపత్రి డైరెక్టర్‌ ప్రాణం తీసిన కోవిడ్‌-19

వుహాన్‌ :  క‌రోనా వైర‌స్ చైనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వుహాన్‌ నగరంలోని వుచాంగ్ హాస్పిట‌ల్ ప్ర‌ధాన‌ ఆసుపత్రి డైర‌క్ట‌ర్ కోవిడ్‌-19 బారిన పడి మంగళవారం ప్రాణాలు కోల్పోయారు. లియూ చిమింగ్.. కరోనా వైర‌స్ కారణంగా మృతిచెందిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు. లియూ చిమింగ్‌ను కాపాడేందుకు చేసిన అన్ని ప్ర‌య‌త్నాలు విఫ‌ల‌మైన‌ట్లు వైద్యులు వెల్ల‌డించారు. లియూ చిమింగ్ మరణాన్ని చైనా అధికారిక టీవీ చానెల్‌ ధ్రువీకరించింది. కాగా కరోనా వైరస్ గురించి ముందస్తు హెచ్చరిక జారీ చేసిన వైద్యుడు లియూ చిమింగ్‌ మృతి చెందడం పట్ల చైనాలో లక్షలాది మంది ఆయనకు సంతాపం ప్రకటించారు. 


కాగా లియూ మృతిపై సోమవారం రాత్రి సోషల్‌మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి. లియూ చిమింగ్‌ సోమవారం రాత్రే మృతి చెందినట్లు హుబీ హెల్త్ కమిషన్ తమ బ్లాగ్‌లో వెల్లడించింది. అయితే వెనువెంటనే ఆయన మరణించలేదని, చికిత్స తీసుకుంటున్నారని తెలిపింది. కాగా లియూ చిమింగ్‌ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 10.30 గంటలకు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. కాగా ఇప్పటి వ‌ర‌కు కోవిడ్‌-19 వ‌ల్ల చైనాలో సుమారు 1868 మంది మ‌ర‌ణించినట్లు చైనా ఆరోగ్య సంస్థ తమ రిపోర్ట్‌లో పేర్కొంది. కాగా కోవిడ్‌ దాటికి మెడిక‌ల్ సిబ్బందికి కూడా పెను ప్ర‌మాదం ఉన్న‌ట్లు రిపోర్ట్ అంచ‌నా వేసింది.